No. of Views : 22
Krishna Board meeting on June 4

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది. హైదరాబాద్‍ జలసౌధలో జూన్‍ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధప్రదేశ్‍ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అందించారు. 

రాష్ట్రంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‍ఎల్‍బీసీ సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని, వాటికి అపెక్స్ కౌన్సిల్‍ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇప్పటికే బోర్డు లేఖ రాసింది. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తమ్మిళ్ల ఎత్తిపోతల, వాటర్‍ గ్రిడ్‍ ప్రాజెక్టుల సమగ్ర వివరాలు, ప్రాజెక్టుల డీపీఆర్‍లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇవే కాకుండా మరే ఇతర అంశాలపైన సమావేశంలో చర్చించాల్సి ఉంటే, ప్రతిపాదనలు పంపించాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటిక లేఖ రాసింది.